చిగురించిన చైత్రం

బాగుందండి.. వర్ణన. ఎక్కడిదీ? అదీ....అడిగింది వసంత.

పాత డైరీ లతోపాటు దొరికింది.

ఎప్పుడో రాసిన తీపి గుర్తులు.తొలికవితను చూస్తూ ..నొక్కి పలుకు తున్న రావు గారి వైపు ఒకింత కోపంగాచూసింది.

అందమైన కవిత దొరికిందిగా.. ఇంక నాతో పని ఉండదు లెండి.

అదెంటోయి అలా అనేసావ్!అసలిది రాసింది నీ కోసమే.నీకు ఇవ్వడానికి దేర్యం సరిపోలేదప్పుడు.

నిజమా!రావుగారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది వసంత.

నిజంగా నిజం.ఒట్టేసి చెప్పమంటావా?

అంత అవసరం లేదు గానీ, నిజంగా నమ్మ మంటారా?

నిజంచెప్పేది నమ్మడానికే.. మరి.

ఒక విషయం చెప్పనా!నేను మీ తొలి కవిత ఎప్పుడో చదివేశా.

ఎప్పుడో అంటే....?

అదే.. పెళ్లి అయ్యాక మన ఇంటికి వచ్చిన కొత్తలోనే...మీ అల్మారాలో బట్టలు కిందున్నఆ పేపర్ చదివి , ఏడుపొచ్చేసింది తెలుసా!

ఎందుకు? అంతచెత్తగాఉందా ?డైరీని అలమారాలొపెడుతూ అడిగారు.

ఛీ!...అదేమీ...కాదు.అదీ... మీరు ఎవరినైనా ప్రేమించారేమో.. తనకోసమే రాశారేమో....అని.... అనిపించి....,అస్సలు... అప్పుడే అడుగుదామనుకున్నాను కానీ.....

అడిగి ఉండాల్సింది కదా. ఎందుకు.. అడగలేదు మరి? కనుబొమ్మలు ఎగరేస్తూకళ్ళజోడు తీసి చేతిలో పెట్టుకుని వసంత వైపు చూశారు.

నాతో పాటు మా అమ్మమ్మ వచ్చి కొన్ని రోజులు ఉన్నారు గుర్తుందా!

ఆ..ఆ... వచ్చినప్పుడల్లా అరిసెలు వండి తీసుకొచ్చేవారు.., నాకిష్టమని. ఆవిడే... కదా!

ఊ..! ఆవిడే. అమ్మమ్మ తో ఈ విషయం చెప్పాను. నీతో.. ప్రేమగా ఉంటున్నాడా.. లేదా ..?అని అడిగింది.నన్ను బాగా చూసుకుంటున్నారని చెప్పాను. అయితే, అమ్మాయి! నువ్వు అనవసరంగా ఈ విషయం అడిగితే మళ్లీ గుర్తు చేసినదానివి అవుతావు. "గతం గతః" . అయినా.... జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. నీకు ఏమన్నా అనుమానం వచ్చిందనుకో... అప్పుడు చెప్పు. ఏం చేయాలో అది చేద్దాం .నువ్వు మాత్రం ఏమీ తెలియనట్లే ఉండు. ఈ కవితలు కథలు గురించి మర్చిపో..అంది. అందుకనే అడగలేదు.

అంతా విని పగలబడి నవ్వ సాగారు ..... రావు గారు.

ఎందుకలా... నవ్వుతారు? నాకప్పుడు అలా అనిపించింది. సా..గదీసింది వసంత.

నువ్వు చాలా మేధావివి సుమా! నవ్వు ఆపుకుంటూ కుర్చీలోంచి లేచారు రావు గారు. అమ్మో! మాయల మరాఠీ లా ఇంకా.. ఏమేమి దాచావో? అయినా, ఆడవాళ్ళ నోట్లో నువ్వ్వు గింజ కూడా దాగదు అని అంటారు కదా!ముఫ్ఫైరెండు సంవత్సరాలు ఎలా.. దాచావు..? "మై గుడ్ నెస్".

మేధావి నని ఒప్పుకున్నారు కదా!ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.వంక దొరికింది కదా... అని అస్తమానం ఏడిపించారంటే... మాత్రం ఊరుకునేది లేదు. తెలిసిందా...! బీరకాయ తొక్కు తీస్తూ మూతి విరిచింది వసంత.

అయినా! నా కోసమని రాస్తే నా చేతికి ఇవ్వకుండా, అలా.... పుస్తకాల కింద,... బట్టలపైన... పెడతారా ఎవరైనా?కవిత అనే పేరు విన్నప్పుడల్లా పడిన టెన్షన్ అయినా తప్పేది ఇన్ని సంవత్సరాలు.

చెప్పిందంతా నిజమేనా? లేక ఇప్పుడు ఏం చెప్పినా సరిపోతుందిలే! అని, కథలు చెప్తున్నారా..? ఈసారి కనుబొమ్మలు ఎగరవేయడం వసంత వంతయింది.

ఆ!... అను. కరెక్ట్ టైం లో కరెక్ట్ పని చేయకపోతే ఇలానే మాటలు పడాల్సి వస్తుంది.నిట్టూరుస్తూ ఒక స్టేట్మెంట్ పడేసి,... కళ్ళజోడు పెట్టుకుని తిరిగి పేపర్ లో మునిగిపోయారు.

అప్పుడు అంటే ధైర్యం సరిపోలేదుసరే! ఇప్పుడు కావాల్సినంత ఉందికదా! ఇప్పుడు రాయండి కవితలు కథలు. పక్కనే కూర్చుని వింటాను. మీకు ,నాకు.. కూడా కాలక్షేపం ఔతుంది.

ఇప్పుడా ?ఈ వయసులో..!

ఏం ? సినిమాలో...సూర్యకాంతమ్మ పాడలే, ముక్కు చూడు... ముక్కందం చూడు... ముక్కున ఉన్న ముక్కెర చూడు.. మగడా! నే ..మునుపటివలెనే.. లేనా?...

నేతిబీర లాంటి ఆ పాతగురుతులిప్పుడింకా.. మనకేల !
పాలకోవాను మించిన తీపిగురుతులు ఎన్నో ఉండగా, మనసు నిండుగా....

అని మళ్లీ కళ్ళెగరేసింది వసంత. చిన్నగా నవ్వుతూ... రావు గారి వైపు చూస్తూ ....

నిజమే!నవ్వుతూ... జారిన కళ్ళజోడు లోనించి వసంత ని చూస్తూ రావు గారు కూడా మొదలుపెట్టారు చెప్పడం...తొలిచూపు తొలివలపు చిగురించిన చైత్రం లో...గుర్తుందా! మన పెళ్లిచూపులు ఈ మాసంలోనే జరిగాయి.

తొలిచూపు తొలివలపు చిగురించెను చైత్రం లో
నీ తలపులతో మది నిండెను నిన్ను చూసిన ఆ నిమిషం లో....

3 thoughts on “చిగురించిన చైత్రం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s