గడిచిన గతం

నారాయణీ…..అమ్మా! నారాయణీ……

మేనత్త పిలుపు వినపడుతూనే.....ఆరేళ్లు నిండుతున్న నారాయణికి కాళ్లు అస్సలు నిలవలేదు.చిన్న పీట పట్టుకుని పిట్ట గోడ వైపు పరుగు పెట్టింది. పీట పైన నిలబడి ,కాళ్ళు రెండూ ఎత్తి చేతిని గోడ అవతలివైపుకు చాపింది. అత్తయ్య రోజూ ఉదయమే తన చేతిలో పెట్టే దేవుని ప్రసాదం అంటే నారాయణికి చాలా చాలా ఇష్టం. ఈ రోజు అసలే తన పుట్టినరోజు. ఏ ప్రసాదం పెడుతుందో!... అని కుతూహలం. అమ్మ ఇంకా నిద్ర కూడా లేచి ఉండదు....,కానీ, అత్త తనకోసం అందరికన్నా ముందే లేచి తనకిష్టమైనవన్నీ వండి పెడుతుంది.చేతిలో తొక్కుడు లడ్డూ ని చూడగానే నారాయణి కళ్ళు భలే మెరిసి పోయాయి.

ఇందా!పట్టు పరికిణీ నీకోసమే.తొందరగా స్నానం చేసి కట్టుకో.అమ్మ ఇంకా లేచినట్టు లేదు...వేడి నీళ్ళు తోడి పెడతాను...ఇక్కడకు వచ్చి స్నానం చేసేయి. ఏకంగా భక్ష్యాలు తిని పోదువు గాని...అంటున్నఅత్త మాటలకు అడ్డు తగిలింది నారాయణి .లేదత్తా! స్నానం చేసి నాన్నతో బయటికి వెళ్ళాలి.నాన్న మిఠాయి కొంటానన్నారు.స్నేహితులందరికీ పంచి ..అప్పుడు వస్తాను. మావయ్య గారికి కూడా చెప్పు...అంటూ..పీట, పరికిణీ పట్టుకుని ఇంటి లోపలికి పరుగుతీసింది.

తెల్లవారుతూనే పిట్ట గోడ వైపు పరుగులు తీయడం బాగా అలవాటైపోయింది. ఉదయమే ఆవిడ ముఖం చూస్తే గాని దీనికి పొద్దు గడవదు….అని నెత్తి మీద మొట్టికాయ వేసి స్నానం చేయించడం పూర్తి చేసింది లక్ష్మమ్మ.

ఎందుకు!.. ఉదయమే... మా అక్కను ఆడిపోసుకుంటున్నావు....భగవంతుడు రాసిన రాత కు పాపం తను ఏం చేస్తుంది? పిల్లలు లేరనే కదా....!నారాయణి అంటే దానికి ప్రాణం.నీ కూతుర్ని అంతలా చూసుకుంటూంటే... నీకేం బాధ అంట!సంతోషపడడం మానేసి... ఉసూరుమంటూ ఉంటావు...అలా ఉత్తినే నోరు పారేసుకోవడం అంత మంచిది కాదు.కాస్త గట్టిగానే ఆలిని మందలించారు కోటేశ్వర్ రావు గారు.

నాన్న్నా...... నేను తయారై పోయాను......పదండి మిఠాయి కొందాం....అంటూ పరిగెత్తుకొని వచ్చి నాన్నగారి చెయ్యి పట్టుకుని లాగింది నారాయణి.

ఏంటి...! అలా జుట్టు విరబోసుకుని రోడ్డుమీదికి పోదామనే.....అసలు దీని అల్లరికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది.ఇంటికి పెద్దదనే విషయం కూడా గుర్తు ఉండదు.తమ్ముణ్ణి,చెల్లెళ్లని. చూసుకోకుండా...బయట పెత్తనానికి బాగా పరిగెడుతూ ఉంటది. మీరిచ్చిన అలుసే కదా అంతా!...రేపు పొద్దున్న నన్ను అనరూ......నలుగురు....అంటున్న లక్ష్మమ్మ మాటలకు తండ్రీ కూతుళ్లు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.

వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనక పడితే వెనకే నోయి

మామయ్య గారి దగ్గర నేర్చుకున్న పద్యాన్ని ఆలపిస్తూ....పదండి నాన్నగారు మనం ముందుకు నడుద్దాం.... మన పనులు పూర్తి చేసుకుని వద్దాం.....అంటూ ఇంటి బయటికి పరుగుతీసింది నారాయణి.

వస్తున్నాను... తల్లి! ఆగు, నెమ్మది… అంటూ వెనకనే నడిచారు కోటేశ్వరరావు గారు.ఇంతలో…..

To Be Continued…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s